ప్రజా చైతన్యమే కళాకారుల లక్ష్యం కావాలి- ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ప్రజా చైతన్యమే కళాకారుల లక్ష్యం కావాలి అని ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు అన్నారు.
తెలంగాణ ప్రజానాట్యమండలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి ప్రారంభమైన డప్పులు, పాటల శిక్షణ శిబిరం ఆదివారంతో నాలుగో రోజు ముగిసింది. జిల్లా కార్యదర్శి నిమ్మల రాంబాబు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు శనిగరపు శ్రీనివాసరావు ముగింపు సభకు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు మాట్లాడుతూ ప్రజానాట్యమండలి కళాకారులు నాటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి ప్రజల్లో చైతన్యం కలిగించారని అన్నారు. జానపద కళారూపాలు, పాటలు, బుర్రకథలు, నాటకాల ద్వారా ప్రజలను పోరాట స్ఫూర్తితో ముందుకు సాగేందుకు కృషి చేశారని పేర్కొన్నారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కళాకారుల కృషి మరవలేనిదని అన్నారు. "కళ ప్రజల కోసమే" అనే ఆశయంతో ప్రజా కళాకారులు నేటికీ పని చేస్తున్నారని చెప్పారు.
నాలుగు రోజుల శిక్షణ శిబిరంలో కళాకారులు శిక్షకులు కాటూరి రాము, కనకం కొమరయ్య, నిమ్మల రాంబాబు, వెంకటేశ్వర్లు, కేలోత్ కృష్ణ, వెంకటలక్ష్మి, వెంకన్న, కె. రామారావు, సంజీవరావు, రామారావు, తోట సుందరం, తాటి నాగరాజు, బిక్కులాల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment