విధి నిర్వహణలో శ్రీనివాసరావు అంకితభావానికి దక్కిన గౌరవం

విధి నిర్వహణలో శ్రీనివాసరావు..అంకితభావానికి దక్కిన గౌరవం
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పోలీస్‌ శాఖలోని వివిధ కేడర్లలో 38 ఏళ్లుగా అంకితభావంతో, నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న పాల్వంచకు చెందిన పెయ్యల శ్రీనివాసరావుకు ప్రశంసా పత్రం లభించింది. శనివారం కొత్తగూడెంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

విధి నిర్వహణలో నిజాయితీ, అంకితభావానికి శ్రీనివాసరావు మారుపేరుగా నిలిచారు. గతంలో సుమారు రూ.7 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్న సందర్భంలో, కేసును నీరుగార్చేందుకు రూ.15 లక్షల లంచం ఇస్తామని చెప్పినా ఆయన తిరస్కరించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పాల్వంచలోని పెద్దమ్మగుడి సమీపంలో రోడ్డు ప్రమాదంలో బీడీ ఆకు కాంట్రాక్టర్లు మృతి చెందిన ఘటనలో వారి వద్ద లభించిన రూ.7.25 లక్షలను నిజాయితీగా పాల్వంచ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఈ ఘటనల్లో ఆయన నిజాయితీని గుర్తించిన అప్పటి అధికారులు ప్రశంసించడంతో పాటు నగదు పురస్కారాలు కూడా అందజేశారు.

శ్రీనివాసరావు అందరితో ఆప్యాయంగా, ప్రేమగా మెలిగే వ్యక్తిగా పోలీస్‌ శాఖలో మంచి పేరు సంపాదించారు. దీంతో పలువురు ఆయనను ముద్దుగా “దేవుడు శ్రీను” అని పిలుస్తుంటారు. గతంలో స్పెషల్‌ పార్టీ, కోర్టు లైజనింగ్‌ ఆఫీసర్‌గా సేవలందించిన ఆయన ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు.

38 ఏళ్ల సర్వీసులో వరుసగా 14 సార్లు ప్రశంసాపత్రాలు అందుకోవడం శ్రీనివాసరావు సేవా నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. గత ఏడాది సేవా పతకాన్ని అందుకున్న ఆయన, ఈ ఏడాది మంత్రి చేతుల మీదుగా మరోసారి ప్రశంసాపత్రం అందుకోవడం పట్ల పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

Blogger ఆధారితం.