పాల్వంచలో ‘2 టౌన్’ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి - ఎస్‌.జె.కె.అహ్మద్

పాల్వంచలో ‘2 టౌన్’ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి -  ఎస్‌.జె.కె.అహ్మద్

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:   పాల్వంచ పట్టణంలో ‘టూ టౌన్’ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎస్‌.జె.కె.అహ్మద్..భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ను కోరారు. సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్‌.జె.కె.అహ్మద్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ పట్టణంలో రోజురోజుకూ జనాభా పెరుగుతుండటంతో పాటు వివాదాలు, ఆకతాయిల గొడవలు పెరుగుతున్నాయి అని తెలిపారు. ప్రస్తుతం లక్షకు పైగా జనాభా కలిగిన పాల్వంచ పట్టణంలో నేరాల సంఖ్య పెరుగుతోందని, తరచూ శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా పట్టణంలోని పలు బార్లు, మద్యం దుకాణాల వద్ద రాత్రి వేళల్లో ఘర్షణలు జరుగుతున్నాయని, యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం పాల్వంచ పట్టణానికి ఒకే ఒక్క పోలీస్ స్టేషన్ ఉండటంతో శాంతిభద్రతల పర్యవేక్షణ, కేసుల దర్యాప్తు, ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు సిబ్బందిపై పరిపాలనా భారం అధికమవుతోందని అహ్మద్ వివరించారు. పట్టణాన్ని టౌన్-1, టౌన్-2 పోలీస్ స్టేషన్ల పరిధిగా విభజిస్తే జనాభా సమానంగా పంపిణీ కావడంతో పాటు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

పాల్వంచలో టూ టౌన్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన పోలీస్ సేవలు అందుతాయని విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.