ఆధునిక భారత నిర్మాత అంబేద్కర్ : యం.ఏ. రజాక్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను అహలే సున్నత్వల్ జమాత్ (ఏ.ఎస్.జే) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశ్‌నగర్ లోని జిల్లా కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ కరీం ఖాద్రీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఏ.ఎస్.జే ఛైర్మన్ యం.ఏ. రజాక్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన మహాత్ముడిగా అంబేద్కర్ చిరస్మరణీయులై నిలిచారని, ఆయన రచించిన రాజ్యాంగం వలననే సమానత్వం కలిగిన ప్రజాస్వామ్యం లభించిందన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, మైనార్టీలను రెండవ శ్రేణి పౌరులుగా చూపించే కుట్రలో భాగంగానే వక్ఫ్ బోర్డు చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా సవరించిందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా చట్టాలు రూపొందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అంబేద్కర్ ఆశయాలే సమాధానమని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఏ స్థాయిలో అయినా పోరాడతామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మహమ్మద్ గౌస్ మోహినుద్దీన్, ప్రధాన కార్యదర్శి షేక్ యఖూబ్ ఖాద్రీ, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అన్వర్ పాషా, మహమ్మద్ హుస్సేన్ ఖాన్, జిల్లా ట్రెజరర్ సయ్యద్ యఖూబ్ ఉద్దీన్, సెక్రటరీ జనరల్ మహమ్మద్ అలీం ఉద్దీన్, యూత్ వింగ్ అధ్యక్షుడు షేక్ నయీమ్, మహమ్మద్ ఉస్మాన్, అడ్వకేట్ మహమ్మద్ సాదిక్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment