పదవ తరగతి ఫలితాలు భవిష్యత్ లక్ష్యాలకు మార్గదర్శకాలు - జిల్లా కలెక్టర్

పదవ తరగతి ఫలితాలు భవిష్యత్ లక్ష్యాలకు మార్గదర్శకాలు  - జిల్లా కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పదవ తరగతి ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలను సాధించడానికి మార్గదర్శకాలు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత కలెక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో ఎన్ని మార్కులు వస్తాయనే విషయాన్ని విద్యార్థులు ఆలోచించకుండా, భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడి చదవాలని సూచించారు. కేవలం పదవ తరగతినే ప్రామాణికంగా తీసుకోకుండా, ఇది ఒక మెట్టుగా భావించి, తర్వాత అనేక కోర్సులు చేయాలని సూచించారు. నిరంతరం కష్టపడితే లక్ష్యాలను సాధించుకోవచ్చని తెలిపారు.

తాను కూడా విద్యార్థి దశలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, పదవ తరగతి చదువుకునేటప్పుడు ఒక మంచి ఇంజనీర్ అవ్వాలని అనుకున్నానని, కానీ తర్వాత లక్ష్యాలను మార్చుకుని పట్టుదలతో చదివి ఐఏఎస్ సాధించానని తన అనుభవాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులు మంచి జీవితాన్ని గడపడానికి ప్రేరణ కలిగి ఉండాలని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు అన్ని రకాల పుస్తకాలు మరియు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ అవర్స్, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను నియమించి నిపుణులతో ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు.

పరీక్షలకు కొన్ని రోజులే సమయం ఉన్నందున విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా చక్కగా చదవాలని సూచించారు. టీవీ, ఫోన్, సోషల్ మీడియా వంటి వాటికి దూరంగా ఉండాలని, సమన్వయంతో చదువుకోవాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి, హాస్టల్లో వార్డెన్లు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించి, జిల్లాలో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా శిక్షణ అందించాలని కలెక్టర్ అన్నారు.

అనంతరం విద్యాశాఖ రిసోర్స్ పర్సన్‌లు సైదులు, నాగరాజు, శేఖర్, విజయభాస్కర్, శ్యాం చందర్ రావు విద్యార్థులకు శిక్షణ తరగతుల్లో వివిధ సబ్జెక్టుల మెలకువలు నేర్పారు.

ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అనసూర్య, ఏఎస్‌డబ్ల్యూఓలు హనుమంతరావు, సునీత, హెచ్‌డబ్ల్యూఓలు గజ్వేల్ శ్రీనివాస్, పద్మావతి, శశిరేఖ, కౌసల్య, రామ నరసయ్య, స్వప్న, కార్యాలయ సిబ్బంది నరసింహారావు, పార్వతి, శశికళ, హేమంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.