పోలీస్ అధికారులతో జిల్లా జడ్జి సమీక్ష సమావేశం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి కేసుల పురోగతిపై వివిధ పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్‌ల వారీగా అడిగి, తగిన సలహాలు ఇచ్చారు. వారంట్ పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన అమలు పరచాలని, నిందితులు దొరకని వారికి సంబంధించిన జామిన్ దార్లకు నోటీసులు ఇచ్చి కోర్టుకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. కేసులలో సాక్ష్యం షెడ్యూల్ ఇచ్చిన కేసుల్లో, కేసు ప్రాపర్టీని షెడ్యూల్ ప్రారంభించకముందే కోర్టులో నమోదు చేసి డిపాజిట్ చేయవలసి ఉంటుందని, రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేయాలని సూచించారు.
పోలీస్ అధికారులు స్టేషన్ల వారీగా ఛార్జ్‌షీట్‌లు నెలలో మొదటి వారం నుంచే దాఖలు చేయాలని, ఆఖరి వారంలో దాఖలు చేస్తే అదే నెలలో వెరిఫికేషన్‌కు సమయం సరిపోదని తెలిపారు. ఆర్ అండ్ బి అధికారులతో కలిసి జిల్లా కోర్టులో నిర్మిస్తున్న అకౌంట్స్ ఆఫీసర్ రూమ్, చాంబర్, నూతన కోర్టులను వారంలో పూర్తి చేయాలని, మణుగూరు కోర్టు రీనోవేషన్, కోర్టు కాంపౌండ్, రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.ఈనెల 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులను పరిష్కరించడానికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి. భానుమతి, న్యాయమూర్తులు బత్తుల రామారావు, ఏ. సుచరిత, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, కొత్తగూడెం డీఎస్పీ ఎండి. అబ్దుల్ రెహమాన్, ఇల్లందు, మణుగూరు డీఎస్పీలు, జిల్లాలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, భద్రాచలం, ఇల్లందు జైలు సూపరింటెండెంట్లు, ఎస్సైలు, కలెక్టర్ ఆఫీస్ సూపరింటెండెంట్ (తహసీల్దార్) శ్రీనివాస్, ఆర్ అండ్ బి అధికారులు, కోర్టు పీసీలు, నోడల్ ఆఫీసర్ జి. ప్రవీణ్ కుమార్, లైజాన్ ఆఫీసర్లు వీరబాబు, అబ్దుల్ ఘని తదితరులు పాల్గొన్నారు.

Post a Comment