పాల్వంచ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా ఘంటసాల జయంతి వేడుకలు
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ప్రఖ్యాత సినీ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి వేడుకలను పాల్వంచ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం
పాల్వంచ పట్టణంలోని స్టార్ చిల్డ్రన్ హై స్కూల్‌లో పాల్వంచ కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి వేముల కొండలరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పాల్వంచ కళా పరిషత్ అధ్యక్షుడు మంతపూరి రాజు గౌడ్ మాట్లాడుతూ ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు ప్రజలకు అందించిన సంగీతం అపూర్వమైనదని అన్నారు. ఘంటసాల మన మధ్య లేకున్నా ఆయన గాత్రం మాత్రం తరతరాలకు కళాభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం స్టార్ చిల్డ్రన్ హై స్కూల్ కరస్పాండెంట్ జి. భాస్కరరావు మాట్లాడుతూ ఘంటసాల గాత్రాన్ని కొత్త తరాలకు పరిచయం చేయడం సమాజం బాధ్యతగా భావించాలని, విద్యాసంస్థలు విద్యార్థుల్లో సంగీతాభిజ్ఞత పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ కళా పరిషత్ కోశాధికారి లింగమూర్తి, టియుఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. మంజూర్, నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్, పాఠశాల ప్రిన్సిపాల్ జి. శ్రీనివాస్ రెడ్డి, కళాకారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment