ప్రకృతి సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడం దుర్మార్గం - ఎమ్మెల్యే కూనంనేని
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ప్రకృతి సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం దుర్మార్గమైన చర్య అని, కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రజలకోసమా, అదాని, అంబానీలకోసమా తేల్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.
శనివారం పాల్వంచలోని చంద్ర రాజేశ్వరరావు భవన్‌లో సీపీఐ జిల్లా సమితి సభ్యులు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ ఆపరేషన్ల పేరుతో సాగుతున్న నిర్బంధాలపై ప్రజా తిరుగుబాటు ఉద్యమాలు తప్పవని, మతాలు, కులాల పేరుతో కాషాయ పార్టీ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రజల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నదని పేర్కొన్నారు.
కమ్యూనిస్టులు లేకుండా చేయాలనే కుట్రతో కేంద్రంలోని పాలకులు యోచిస్తున్నారని, అందుకే మావోయిస్టులను కూడా డెడ్‌లైన్ పెట్టి హతమార్చుతున్నారని మండిపడ్డారు. అడవుల్లో నిక్షిప్తమైన అపార ఖనిజ సంపదను కాజేసేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని బూటకపు ఎన్‌కౌంటర్లు చేసి మావోయిస్టు నేతలను హతమార్చడం సరైనది కాదని, శాంతి చర్చలకు సిద్ధమని చెప్పినా ఈ మారణహోమానికి తెగబడటం పైచాచికమని, మావోయిస్టుల హత్యలపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఆచరణీయమైనవని, మనుష్యులను హతమార్చినంత మాత్రాన సిద్ధాంత పునాదులను కదిలించలేరని తెలిపారు. సీపీఐ భారతదేశంలో ఆవిర్భవించి వందేళ్లు అవుతుందని, భారత స్వతంత్ర సంగ్రామంలో తనదైన పాత్ర పోషించి స్వదేశకాంక్ష రగిలించి తమ ప్రాణాలను దేశంకోసం పణంగా పెట్టారని గుర్తు చేశారు. ఈ వందేళ్లపాటు ప్రజా సమస్యల పరిష్కారం, పేదలు, కార్మికులు, రైతుల పక్షంలో నిరంతర పోరాటాలు సాగించిన ఘనత సీపీఐదే అని చెప్పారు.
మరిన్ని సంవత్సరాలు ప్రజా క్షేత్రంలో మనగలమని, ఇదే స్ఫూర్తితో నిరంతర పోరాటాలు నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం మరిన్ని బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 18న ఖమ్మం కేంద్రంగా సీపీఐ శతవసంత ఉత్సవ ముగింపు సభ ఐదు లక్షల మందితో జరగనుందని, ఈ ముగింపుకు 45 దేశాల నుండి ప్రతినిధులు తరలివస్తారని చెప్పారు. కమ్యూనిస్టుల పనైపోయిందని అవాకులు, చెవాకులు పేలే వారికి ఈ వేడుక కనువిప్పు కావడంతో పాటు దేశ చరిత్రలో మైలురాయిగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.
అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా మాట్లాడుతూ పాలకులు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని, లేకపోతే ప్రజాగ్రహానికి గురికావాల్సివస్తుందని పేర్కొన్నారు. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ ఒంటరి పోరాటం చేసి విజయతీరాలకు చేరిందని, సీపీఐని నిలువరించాలని ప్రయత్నించిన వారికి నిరాశే మిగిలిందని చెప్పారు. ఎర్రజెండా వనైపోయిందని కూసే వారికి గ్రామపంచాయితీ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టని, సీపీఐని లేకుండా చేద్దామని చూసిన అనేక పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని గుర్తుచేశారు.
అధికారం, పదవులు ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని, ప్రజలను మోసం చేసేవారిని నిలదీస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతటి ఉద్యమానికైనా, త్యాగానికైనా వెనకాడవద్దని చెప్పారు. జనవరి 18న ఖమ్మం కేంద్రంగా జరిగే సీపీఐ శతవసంత ఉత్సవాల ముగింపు సభ ఐదు లక్షల మందితో జరగనుందని, ఆ సభకు ప్రపంచ దేశాల నుండి అనేక మంది తరలివస్తారని తెలిపారు.
సభకు జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజలను తరలించేందుకు నాయకులు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు మిరియాలు రంగయ్య, సర్ రెడ్డి పుల్లారెడ్డి, నరాటి ప్రసాద్, వై. ఉదయ భాస్కర్, మున్నా లక్ష్మీకుమారి, కే. సారయ్య, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, చంద్రగిరి శ్రీనివాసరావు, వాసిరెడ్డి మురళి, రేసు ఎల్లయ్య, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, జీ. వీరస్వామి, భూక్య దాసురి, బంధం నాగయ్య, ఉప్పుశెట్టి రాహుల్, ఫహీం, మండల, పట్టణ కార్యదర్శులు, ప్రజాసంఘాల జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment