ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అభివృద్ధితో తెలంగాణ అగ్రగామిగా ఎదుగుదల.. సీఎం రేవంత్ రెడ్డి

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాల అభివృద్ధితో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి వాకాటి శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, రామసహాయం రఘురాం రెడ్డిలతో కలిసి  సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రిని కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ బి. రోహిత్ రాజు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా భద్రాద్రి  కొత్తగూడెం జిల్లాలో  ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సీఎం ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తవుతున్న వేళ ఖమ్మం ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి పాల్వంచే పునాది అని గుర్తుచేసిన సీఎం, గతంలో కేటీపీఎస్ స్థాపన సమయంలో స్థానికులకు న్యాయం జరగకపోవడం ఉద్యమానికి కారకమైందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆరాధ్య నేత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ రూపొందించిన ఎడ్యుకేషన్–ఇరిగేషన్ పాలసీలే భారత అభివృద్ధికి పునాదన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ వంటి అనేక నీటి పారుదల ప్రాజెక్టులు నెహ్రూ దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. అదే స్ఫూర్తితో తెలంగాణలో విద్య, నీటి వనరుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలోని ఖనిజ సంపదపై పరిశోధనలు జరిపేందుకు ఎర్త్ యూనివర్సిటీ కీలకమని చెప్పారు. జిల్లాకు వైద్య కళాశాల, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి వంటి కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం సహా పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.

రాష్ట్ర పాలనకు ఖమ్మం ప్రజలే ఆయువు పట్టు అని, ఇక్కడ ప్రారంభించిన రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇండ్ల నిర్మాణ పథకాలు, చీరలు వంటి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైనాయని సీఎం వివరించారు. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మంచి, నిబద్ధత కలిగిన అభ్యర్థులను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ విజయోత్సవాలు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాలకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర జాతీయ నేతలను ఆహ్వానించేందుకు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపారు.


ఆనంతరం  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపన తెలంగాణలో జరగడం చారిత్రాత్మకమన్నారు. భూమి శాస్త్రాలపై విస్తృత పరిశోధనలు జరిగే కేంద్రంగా ఇది నిలుస్తుందని చెప్పారు. అవసరమైన మౌలిక వసతులు త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.


వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచే విశ్వవిద్యాలయాన్ని ఖమ్మం జిల్లాకు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి జలాలను జిల్లాకు తీసుకురావడమే లక్ష్యమని, సీతారామ ప్రాజెక్టుకు అదనంగా నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెంకు విమానాశ్రయం అవసరమని అభిప్రాయపడ్డారు.


రెవెన్యూ, హౌసింగ్ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను రెండేళ్లలోనే అమలు చేస్తోందని చెప్పారు. మన్మోహన్ సింగ్ పేరిట యూనివర్సిటీ ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు.


కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎర్త్ యూనివర్సిటీని జిల్లాకు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథక పనులు వేగంగా సాగుతున్నాయని, 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం లభించిందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విద్యా చందన, వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.