నా కొడుకు నన్ను చంపుదామని చూస్తున్నాడు - ఓ వృద్ధతల్లి ఆవేదన
బాధితురాలు ఎండి ముంతాజ్ బేగం (74) కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.... పాల్వంచ మండలం బసవతార కాలనీలో ఎం.డి ముంతాజ్ బేగం తన భర్త ఎం.డి. ఫయాజుద్దీన్ ఖాన్ చే నిర్మించబడిన ఇంటిలో (నెం: 4-124/3) ఒంటరిగా నివాసం ఉంటున్నానని, తనకు బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట ప్రాబ్లం వంటి అనేక అనారోగ్య రుగ్మతలతో సతమతమవుతూ వయోభారంతో సమస్యలు ఎదుర్కొంటున్నానని ముంతాజ్ బేగం తెలిపారు. తనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు, వారందరూ వేర్వేరు ప్రాంతాల్లో నివాసాలు ఉంటున్నట్లు తెలిపారు.
తన భర్త ఫయాజుద్దీన్ బ్రతికుండగా తమ ఇంటిని తన అనంతరం తాను (ముంతాజ్ బేగం) ఉండే విధంగా, ఆమె అనంతరం పిల్లలందరూ సమానంగా పంచుకోవాలని రిజిస్టర్ వీలునామా చేయించినట్లు తెలిపారు. తన భర్త ఫయాజుద్దీన్ గత సంవత్సరం మృతి చెందారని, తన ఇంటి పైభాగంలో చిన్న కుమారుడు ఎం.డి. రహమత్ ఖాన్ గతంలో ఉండేవాడని, గత రెండు సంవత్సరాల క్రితం అతను ఇంటి నుండి వెళ్లి బయట వేరేగా ఉంటున్నాడన్నారు. చిన్న కుమారుడు ఎం.డి. రహమత్ ఖాన్ తరచూ అతని భార్య గులాబ్ షాతో పాటు అతని బావమరిది రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇమ్రాన్, అతని బౌన్సర్లను మరియు భార్య తరపున బంధువులను తన వెంట ఇంటికి తీసుకుని వచ్చి తనపై దౌర్జన్యం, జులుం ప్రదర్శిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. ఆస్తి మొత్తం తనకు రాసివ్వాలని బెదిరిస్తూ వేధిస్తున్నాడని, తనను చంపుతానని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తూ, తనపై మరియు మిగతా కుటుంబ సభ్యులపై తన భార్య ద్వారా పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే విషయంపై గత నెల 12న తన ఇంటిమీదకు భార్య తరపున బంధువులు, బౌన్సర్లు తీసుకుని వచ్చి ఇంట్లో ఉన్న తనను దుర్భాషలాడుతూ చంపుతానని హల్చల్ చేశారని తెలిపారు. ఇంట్లోని సీసీటీవీ మెమరీ కార్డు ఎత్తుకుని వెళ్లిపోయాడన్నారు. ఆనాడు జరిగిన సంఘటనను రూరల్ ఎస్పై కి తన పెద్ద కుమారుడు తెలపగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గొడవకు సంబంధించిన ఆధారాలు తీసుకున్నారని, అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.
తన కుమారుడు ఎం.డి. రహమత్ ఖాన్, అతని భార్య తరపున బంధువులతో తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి వృద్ధురాలైన తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆమె జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బాధితురాలతో పాటు కుటుంబ సభ్యులు యండి. షఫీ ఖాన్, సాబీర్ ఖాన్, ఆఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment