హత్యాయత్నం కేసులో నలుగురికి జైలు శిక్ష
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: హత్యాయత్నం కేసులో నలుగురికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కే కిరణ్ కుమార్ మంగళవారం తీర్పు చెప్పారు.
బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన తాళ్లూరి భారతి 2019 ఫిబ్రవరి 11న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. తన భర్త జగదీశ్వర్‌రావు, మరిది సర్వేశ్వరరావు తమ భూమిలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో ఇరవెండి గ్రామానికి చెందిన సున్నం ముత్తయ్య, సున్నం తులసమ్మ, సున్నం గోపాలకృష్ణ అలియాస్ గోపాల్, అలాగే అశ్వాపురం మండలం చింతిర్యాలకు చెందిన కొమరం అంజయ్య, ఇతరులు కత్తులు, గొడ్డలులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని భారతి ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ మధ్య ఎప్పటినుండో భూ వివాదాలు ఉన్నాయని తెలిపారు.
గ్రామస్తులు భుక్యా బాలాజీ, భుక్యా జక్రి, బాధావతు బాలకృష్ణ, దారావత్ సురేష్ ఈ దాడిని ప్రత్యక్షంగా చూశారని విచారణలో తేలింది. గాయపడిన వారిని వెంటనే బూర్గంపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం అప్పటి ఎస్సై బి.బాలకృష్ణ కోర్టుకు చార్జ్‌షీట్ సమర్పించారు.
కేసులో సున్నం అజయ్ మైనర్ కావడంతో అతనిపై వేరుగా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. మరో నిందితుడు సున్నం చెంచయ్య విచారణలో ఉండగానే మరణించడంతో అతనిపై కేసు కొట్టేశారు..
14 మంది సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా సున్నం ముత్తయ్య, సున్నం తులసమ్మ, సున్నం గోపాలకృష్ణ అలియాస్ గోపాల్, కొమరం అంజయ్యలకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, ప్రతి ఒక్కరికి 2,000 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
కేసు ప్రాసిక్యూషన్‌ను ఏపీపీ కె. రాజారావు నిర్వహించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ డి. రాఘవయ్య, లైజన్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్, డ్యూటీ ఆఫీసర్ పిసి జే. సురేష్ సహకరించారు.

Post a Comment