పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  పాల్వంచలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది. పాల్వంచ మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన చైతన్య ప్రకాష్ అనే యువకుడు ఇటీవల తాపీ పనుల సందర్భంగా మూడో అంతస్తు నుండి జారిపడి తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన దవడ బొక్క పూర్తిగా విరిగిపోయింది.

తీవ్ర నొప్పితో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, డాక్టర్ వంశీ కృష్ణ ఆధ్వర్యంలో విరిగిన దవడపై శస్త్రచికిత్స నిర్వహించారు. ప్లేట్లు అమర్చడంతో పాటు అర్చ్ బార్స్ సాయంతో దవడను సరిగ్గా అతికించి, భవిష్యత్తులో నమలడం వంటి క్రియలపై ఎటువంటి ప్రభావం లేకుండా నిపుణంగా చికిత్స అందించారు. ప్రస్తుతం బాధితుని ఆరోగ్యం మెరుగుపడడంతో నేడు అర్చ్ బార్స్ తొలగించి ఇంటికి పంపించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు లక్ష రూపాయల విలువైన చికిత్స ఉచితంగా అందించడం గర్వకారణమని బాధితుడు చైతన్య పేర్కొన్నారు. వైద్య సేవలు అందించిన డాక్టర్ వంశీ కృష్ణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ప్రసాద్, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్, డీసీహెచ్ఎస్ రవి బాబు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బృందాన్ని అభినందించారు. 

Blogger ఆధారితం.