విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని చాటాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : విద్యార్థులు ఒకరినొకరు గౌరవించుకుంటూ క్రమశిక్షణతో కూడిన క్రీడా స్ఫూర్తిని చాటాలని భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ - పాల్వంచలో 10వ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ముందుగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్, జ్యోతిబాపూలే తదితర మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకం, సంక్షేమ గురుకులాల పతాకం, ఒలంపిక్ పతాకాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, గురుకులాల జాయింట్ సెక్రెటరీ సక్రు నాయక్, జోనల్ అధికారి కొప్పుల స్వరూప రాణి లు వరుసగా ఆవిష్కరించారు.
అనంతరం స్టేట్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ సూచకగా క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపారు. స్పోర్ట్స్ మీట్ ఓవరాల్ ఇంచార్జ్ సట్ల శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి. శ్రీనివాస్, టెక్నికల్ మేనేజర్ కె. వాసు ఆధ్వర్యంలో కొనసాగిన విద్యార్థుల మార్చిఫాస్ట్ విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆయన సూచించారు.
విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడంలో సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపక సిబ్బంది చేస్తున్న కృషి ఇతరులకు ఆదర్శనీయమన్నారు. సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని చాటుతూ అంతర్జాతీయ వేదికల మీద ప్రతిభ చూపడం వీరి కృషికి నిదర్శనం అన్నారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ప్రతిభ చూపడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, చురుకుదనం కలుగుతుందన్నారు.
ఇంత పెద్ద మొత్తంలో పండగ వాతావరణంలా పాల్వంచ బాలుర గురుకులం ఆవరణ తయారు కావడానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు అందర్నీ ఆకర్షించగా, పాల్వంచకు చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ సుభాష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన ఆర్ట్ గ్యాలరీ, ఫోటో గ్యాలరీ అందరి మన్ననలు పొందింది.
ఈ కార్యక్రమంలో పాల్వంచ తహసీల్దార్ జి. వివేక్, ఎంపీడీవో బి. నారాయణ, మల్టీ జోనల్ ఆఫీసర్ కాంపాటి అలివేలు, భద్రాద్రి జోన్ జోనల్ అధికారి కొప్పుల స్వరూప రాణి, 3వ జోన్ జోనల్ ఆఫీసర్ కె. ప్రత్యూష, స్థానిక పాల్వంచ గురుకుల ప్రిన్సిపల్ పి.వి.ఎన్. పాపారావు, సీనియర్ ప్రిన్సిపల్స్ డా. కన్నెకంటి వెంకటేశ్వర్లు, ఖమ్మం డిసిఓ రాజ్యలక్ష్మి, సీనియర్ ప్రిన్సిపల్స్ ఎస్పీ రాజు, నాగేశ్వరరావు, ఎం. స్వరూప, తుమ్మల విజయదుర్గ, చావ జ్యోతి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment