ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన అవసరం - న్యాయమూర్తి జి. భానుమతి

ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన అవసరం - న్యాయమూర్తి జి. భానుమతి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :ఎయిడ్స్ రహిత సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి తెలిపారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆదివారం కొత్తగూడెం ఓల్డ్ డిపో నుండి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ వరకు సాగిన ర్యాలీని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి జెండా ఊపి ప్రారంభించారు.


అనంతరం కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి న్యాయమూర్తి జి. భానుమతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, యుక్తవయసు వారు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ మహమ్మారి బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఎయిడ్స్ బాధితులను చులకనగా చూడరాదని, వారిపై వివక్ష చూపరాదని సూచించారు. హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన చాలా అవసరమని, ఎటువంటి అనుమానం వచ్చినా తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.


అనంతరం కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ, యువత చెడు మార్గాలను ఎంచుకోవడం వల్ల హెచ్ఐవి/ఎయిడ్స్ బారిన పడుతున్నారని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారితో సహజీవనం, కలిసి ఉండటం, కలిసి భోజనం చేయడం వలన వ్యాధి రాదని, రక్త మార్పిడి, ఇంజెక్షన్ల పంచుకోడం, లైంగిక సంబంధాల వల్ల వ్యాధి సోకుతుందని వివరించారు.

డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎల్. భాస్కర్ నాయక్ మాట్లాడుతూ, ఎయిడ్స్ వ్యాధి పట్ల విద్యార్థులలో అవగాహన పెంచేందుకు కళాశాలల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి. నిరంజన్, న్యాయవాది మెండు రాజమల్లు తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.