కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు నారాజ్
- నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం
- పార్టీనే నమ్ముకున్న నేతలు, కార్యకర్తలకు ఇకనైనా న్యాయం చేస్తారా?
- పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, పార్టీ శ్రేణుల్లో నిజమైన కార్యకర్తలకు తగిన గౌరవం దక్కడం లేదు. దాదాపు పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్ నేతలు, కార్యకర్తలను పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపుదారులకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
ఎన్నికల సమయంలో పార్టీకి అండగా నిలబడి కష్టపడ్డవారికి ఇప్పుడు కొంతమంది ఫిరాయించిన నాయకుల వల్ల గుర్తింపు కరువైందంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పైకి అంతా ఒకేలా కనిపించినా, పార్టీలో అంతర్గతంగా మాత్రం సీనియర్-జూనియర్ భేదాలు పార్టీ శ్రేణుల్లో చలరేగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అనే విధంగా అంతర్గతంగా షురూ అయిన వార్‌పై ప్రత్యేక కథనం.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు మంత్రులు ఉన్నా, తమకు తగిన గుర్తింపు దక్కట్లేదంటూ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు నారాజ్ అవుతున్నారు. ఎన్నికల సమయంలో పార్టీని నమ్మి శ్రమించిన నేతలపై అధికారం వచ్చిన తర్వాత కూడా అధిష్ఠానం కనీసం దృష్టి పెట్టకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
"కొత్తగూడెం సీటు త్యాగం...
రాష్ట్రమంతటా ఎన్నికల అనంతర పరిణామాలు ఒక రకంగా ఉన్నప్పటికీ, కొత్తగూడెం జిల్లా పరిస్థితి మాత్రం విభిన్నంగా ఉందని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కొత్తగూడెం అసెంబ్లీ సీటును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా పేరున్న కొత్తగూడెం సీటు సీపీఐకి వదిలివేయడంతో, కొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అయితే పార్టీకి నిబద్ధతతో ఉన్న కార్యకర్తలు కూనంనేనిని గెలిపించేందుకు కృషి చేసి విజయాన్ని సాధించించారు.
అయినప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసిన ఏకైక సీటు కొత్తగూడెం అని భావిస్తున్నప్పటికీ, అక్కడి నేతలు వివక్షకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, నామినేటెడ్ పోస్టుల విషయంలో పూర్తి నిర్లక్ష్యం ఎదుర్కొన్నామని స్థానిక కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. జిల్లాలో కేవలం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పొదెం వీరయ్యకు రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది.ఇతర నేతలు, పార్టీ శ్రేణులకు ఇప్పటికీ ఎలాంటి గుర్తింపు లేకపోవడం గమనార్హమని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ వివక్షపై అధిష్టానం తగిన చర్యలు తీసుకుని, పార్టీ శ్రేణులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇన్నర్ వార్ :
ఈ అసంతృప్తే పార్టీలోని వర్గాల మధ్య అంతర్గత గొడవలకు కారణమవుతున్నట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో కొత్తగా పార్టీలో చేరిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, గతంలో పార్టీ కోసం అండగా నిలబడిన కార్యకర్తలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో సీనియర్ నేతలకు కాంగ్రెస్ పట్ల నమ్మకం తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక అవమానాలు, అఘాయిత్యాలను చవిచూశామని, ఇక తమ ప్రభుత్వ హయాంలో కార్యకర్తలు, పార్టీ నేతలకు మంచి రోజులు వచ్చాయని ఆశించారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ తప్పక న్యాయం జరుగుతుందని విశ్వసించారు. కానీ ఇప్పుడు పార్టీ ఫిరాయింపు నేతల అనుచరులకే ప్రతి చోట ప్రాధాన్యం ఇవ్వడంతో సీనియర్ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇంతకాలం పార్టీ కోసం శ్రమించి పక్క చూపులు చూడని సీనియర్ నేతలను అధిష్ఠానం తగిన ఫలితం ఇస్తుందని ఆశించినప్పటికీ, ఫిరాయింపు నేతలకే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఇక జిల్లాలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో జాప్యం కొనసాగుతూనే వస్తుంది. జిల్లాలో ఉన్న నామినేటెడ్ పదవులు తమకే కేటాయించాలంటూ సీనియర్ నేతలు ఒకవైపు వాదిస్తుంటే.. మరోవైపు జూనియర్ నేతల సైతం తామేమి తక్కువ కాదు అంటూ తమదైనా రీతిలో పావులు కదుపుతున్నారు. దీంతో నామినేటెడ్ పదవుల సమయంలో పెద్ద రగడనే జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అధిష్టానం మాత్రం కొత్తగూడెం జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీకి జాప్యం చేస్తూ కాలయాపన చేస్తుంది.
దీంతో కాంగ్రెస్ జెండా ఎత్తి నేటికీ భుజాన మోస్తున్న నిజమైన నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరుతోంది. ఇన్నేళ్లుగా తాము చిత్తశుద్ధితో పార్టీలో పనిచేసినా అధిష్ఠానం గుర్తించలేకపోతోందని బాధపడుతున్నారు.
మరి కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తిని కాంగ్రెస్ పెద్దలు గమనించి పార్టీ సీనియర్ నేతలను, కార్యకర్తలను గుర్తించి పదవుల్లో తగిన న్యాయం చేస్తారా? లేక పార్టీ ఫిరాయింపుదారుల మాయలో పడి నిజమైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం చేస్తారా? అనే చర్చ ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది.
మరి అసంతృప్తి వాదులను కాంగ్రెస్ పెద్దలు ఎలా బుజ్జగిస్తారో చూడాలి. అసలే జాప్యానికి మారుపేరు కాంగ్రెస్. ఆ పార్టీలో నిర్ణయాలు అంత త్వరగా ఉంటాయనేది అనుమానమే.

Post a Comment