24 గంటల్లో మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

24 గంటల్లో మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  తప్పిపోయిన ఏడేళ్ల బాలికను కొత్తగూడెం మూడో పట్టణ పోలీసులు, చైల్డ్ హెల్ప్‌లైన్‌–1098 జిల్లా బృందం సమన్వయంతో 24 గంటల్లో గుర్తించి బాలిక ను ఆమె తండ్రికి అప్పగించారు.

వివరాలకు వెళ్తే..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం జయశంకర్ కాలనీకి చెందిన బాలిక ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తప్పిపోయింది. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు చైల్డ్ హెల్ప్‌లైన్‌–1098 జిల్లా కోఆర్డినేటర్ బానోత్ సందీప్ ఆధ్వర్యంలో బృంద సభ్యులు గాడిద భవానీ, ఆవునూరి భావన, దేవరకొండ రంజీత్ గాలింపు చేపట్టారు. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆదేశాలతో పోలీసు సిబ్బంది, చైల్డ్ హెల్ప్‌లైన్ బృందం చేసిన ప్రయత్నాలతో బాలిక ఆచూకీ ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రామవరంలో లభ్యమైంది.

అనంతరం బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరచగా, కమిటీ సభ్యులు సబ్బాతి సుమిత్రాదేవి, మహమ్మద్ సాదిక్ పాషా బాలికను తండ్రికి అప్పగించారు. బాలికను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పోలీసు సిబ్బంది, చైల్డ్ హెల్ప్‌లైన్‌–1098 బృందాన్ని కమిటీ సభ్యులు అభినందించారు.

18 ఏళ్లలోపు బాలబాలికలు ఎక్కడైనా ఒంటరిగా కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్‌ 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కమిటీ సభ్యులు సూచించారు.

Blogger ఆధారితం.