పాల్వంచలో ఘనంగా సమాధుల పండుగ
- పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరాలని క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: మృతిచెందిన తమ కుటుంబ సభ్యులు, పూర్వీకుల జ్ఞాపకాలను స్మరించుకుంటూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని క్రైస్తవులు నిర్వహించే సమాధుల పండుగను పాల్వంచలో ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏడాది నవంబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు సమాధుల పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా పాల్వంచ పట్టణ పరిధిలోని వనమా కాలనీలోని సీ.ఎస్.ఐ క్రైస్తవుల సమాధుల ప్రాంగణంలో సోమవారం సమాధుల పండుగను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మృతిచెందిన తమ కుటుంబ సభ్యులు, పూర్వీకుల సమాధులను రంగురంగుల పూలతో అందంగా అలంకరించి, కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. వారి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం పరలోకంలో నిద్రిస్తున్న తమ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం తమ పెద్దలు, కుటుంబ సభ్యుల సమాధుల వద్దకు చేరుకుని నివాళులర్పించారు. తమ వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ పలువురు భావోద్వేగానికి గురయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వనమా కాలనీలోని సమాధుల ప్రాంగణం సందడిగా మారింది.

Post a Comment