ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటాం - మంత్రి పొన్నం ప్రభాకర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రవళిక తల్లికి ప్రభుత్వంలో ఉద్యోగం కల్పించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం మేరకు బ్యాంకు ద్వారా ప్రమాద బీమా కింద మరో కోటి రూపాయలు కుటుంబానికి అందనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ యాజమాన్యం స్పందించి ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నించిందని, అయితే దురదృష్టవశాత్తూ ప్రవళిక ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో బాధ్యుడిపై హత్యాయత్నం కేసును హత్య కేసుగా నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆర్టీసీ సిబ్బంది ఎవరైనా ప్రయాణికులతో తప్పుగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రయాణికులు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, ఏవైనా సమస్యలు ఎదురైతే చట్టపరంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఒకరి నిర్లక్ష్యం లేదా ఆవేశపూరిత చర్యల వల్ల ఒక కుటుంబం రోడ్డున పడే పరిస్థితి రావడం బాధాకరమన్నారు.
ప్రవళిక కుటుంబానికి ఆర్థికంగా, అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే ఆర్థిక సహాయం అందించినప్పటికీ కుటుంబ సభ్యురాలిని కోల్పోయిన బాధను తీర్చలేమని విచారం వ్యక్తం చేశారు.

Post a Comment