వనమా కాలనీలో ముందుకు కదలని డ్రైనేజీ మురుగు నీరు.. వెదజల్లుతున్న దుర్గంధం
- దుర్వాసనతో స్థానిక ప్రజల అవస్థలు.
- దోమల స్వైరవిహారంతో వ్యాధుల భయం.
- పట్టించుకోని మున్సిపల్ అధికారులు, 7వ డివిజన్ కార్పొరేటర్.
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ పట్టణంలోని 7వ డివిజన్ వనమా కాలనీలో పారిశుద్ధ్య సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కాలనీ ప్రధాన రహదారి పక్కన ఉన్న కల్వర్ట్ దగ్గర మురుగునీరు నెలల తరబడి నిలిచిపోవడంతో పరిసర ప్రాంతాలన్నీ దుర్వాసనతో నిండిపోతున్నాయి. డ్రైనేజీ నీరు ముందుకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోయి క్రమంగా రంగు మారి, నాచు పేరుకుపోయి దోమలకు ఆవాసంగా మారింది. దీంతో సమీప ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
నామమాత్రపు చర్యలతోనే సరి! :
ఈ సమస్యను పలువురు స్థానికులు డివిజన్ వాట్సాప్ గ్రూపులో ప్రస్తావించి కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కార్పొరేటర్ జేసీబీతో కాలువ తవ్వించినట్లు పేర్కొన్నప్పటికీ, చేపట్టిన పనులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో సమస్యకు పరిష్కారం లభించలేదని స్థానికులు చెబుతున్నారు. కాలువను సక్రమంగా తవ్వకపోవడంతో మురుగునీరు యథాస్థితిలోనే నిలిచిపోయిందని, దీంతో మరింతగా నాచు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దుర్వాసనతో ప్రజల అవస్థలు :
ప్రధాన రహదారి పక్కనే మురుగునీరు నిలిచిపోవడంతో అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులతో పాటు సమీప నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన కారణంగా ఇళ్లలో ప్రశాంతంగా ఉండలేకపోతున్నామని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు నిల్వ ఉన్న మురుగునీటిలో దోమలు విపరీతంగా పెరుగుతుండటంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కనీస పారిశుద్ధ్య చర్యలూ కరువు :
వనమా కాలనీలో దోమల నివారణకు కనీస పారిశుద్ధ్య చర్యలు కూడా చేపట్టడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యపై 7వ డివిజన్ కార్పొరేటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అంటున్నారు. ఇప్పటికైనా పాల్వంచ మున్సిపల్ అధికారులు, ఏడవ డివిజన్ కార్పొరేటర్ తక్షణమే స్పందించి ప్రధాన రహదారి పక్కన నిలిచిన మురుగునీటిని తొలగించడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో శుభ్రం చేయించాలని కోరుతున్నారు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా ఈ సమస్య కు వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని వనమా కాలనీ వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
వీడియో :

Post a Comment