నవంబర్ నెల మొత్తం జిల్లా వ్యాప్తంగా సైబర్ అవగాహన కార్యక్రమాలు – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: సైబర్ ఆర్థిక నేరాలను అరికట్టి ప్రజల్లో సురక్షితమైన డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంపొందించేందుకు నవంబర్ నెల మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా “మీ డబ్బు – మీ క్లిక్ – మీ ఎంపిక” అనే నినాదంతో ప్రత్యేక సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ నేరాల నివారణకు సంబంధించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు నిత్యం కొత్త పద్ధతుల్లో ప్రజలను ఆర్థిక మోసాలకు గురిచేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ వినియోగదారుల సేవా కేంద్రాల నంబర్లు, అధిక లాభాలు వస్తాయని ఆశ చూపే పెట్టుబడి పథకాలు, తెరను పంచుకునే యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు.
ఎవరైనా సైబర్ ఆర్థిక మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 సైబర్ నేరాల సహాయ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ సీఐ నరేష్, టేకులపల్లి సీఐ సత్యనారాయణ, ఎస్సై జుబేదా బేగం, సైబర్ వారియర్స్ పాల్గొన్నారు..

Post a Comment