గ్యాస్ అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటాం – కలెక్టర్ అంకిత్

గ్యాస్ అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటాం – కలెక్టర్ అంకిత్

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం :   జిల్లాలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు చేయడం, గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించడం వంటి చర్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ, పౌర సరఫరాల శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయానికి సంబంధించిన సాగుభూమి వివరాలు, ప్రస్తుత సాగు పరిస్థితులు, ప్రధాన పంటల వివరాలు, రైతులకు అందుతున్న ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితులపై వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రైతుభరోసా, రైతు భీమా పథకాల అమలు, లబ్ధిదారుల సంఖ్య, రైతులకు అందుతున్న ప్రయోజనాలపై సమగ్ర సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో పంటల వారీగా సాగు విస్తీర్ణం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నీటి వనరులు, చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఆయకట్టు విస్తీర్ణం, సాగునీటి లభ్యత తదితర అంశాలపై సమగ్ర సమాచారం తెలుసుకుని, జిల్లాలో సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ రైతులకు అవసరమైన నీటిని సకాలంలో అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

పౌర సరఫరాల శాఖకు సంబంధించి జిల్లాలో పనిచేస్తున్న రేషన్ దుకాణాల సంఖ్య, లబ్ధిదారులకు అందుతున్న సన్నబియ్యం పంపిణీ వివరాలు, నిల్వలు, సరఫరా పరిస్థితులపై కలెక్టర్ సమీక్షించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సమయానికి నాణ్యమైన రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లాలో గ్యాస్ నిల్వల పరిస్థితిపై కూడా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గ్యాస్ నిల్వలు తగినంతగా ఉన్నప్పటికీ, వినియోగదారులు కొరత ఏర్పడుతుందనే భయంతో ముందుగానే అధిక మొత్తంలో బుకింగ్ చేయడం వల్ల కొన్నిచోట్ల తాత్కాలిక సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు.

దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. అలాగే గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెట్‌లో విక్రయించడం వంటి చర్యలను కట్టడి చేయడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. గ్యాస్‌ను అక్రమంగా నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, పౌర సరఫరాల మేనేజర్ త్రినాథ్ బాబు, ఇరిగేషన్ ఈఈ అర్జునరావు, ఇరిగేషన్ శాఖ ఏఈలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.