జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి - జిల్లా జడ్జి పాటిల్ వసంత్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఈ నెల 28న అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు తమ పెండింగ్ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని తెలిపారు.
లోక్ అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ (NI Act) కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, మోటార్ వాహన ప్రమాద నష్టపరిహార కేసులు (MVOP), వివాహ బంధానికి సంబంధించిన కేసులు, ఆస్తి పంపకాల వివాదాలు, అద్దె వివాదాలు, ఇతర సివిల్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ-చలాన్ కేసులు, సైబర్ క్రైమ్ కేసులు, చిన్న చిన్న దొంగతనం కేసులు, టెలిఫోన్ కేసులు, మనోవర్తి కేసులు, కొట్టుకున్న కేసులు తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
లోక్ అదాలత్ ద్వారా ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తక్షణమే తుది పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ గెలుపోటములు ఉండవని, ఇరుపక్షాల అంగీకారంతోనే నిర్ణయం జరుగుతుందని తెలిపారు. లోక్ అదాలత్‌లో తీసుకునే నిర్ణయంపై మళ్లీ అప్పీల్ చేసే అవకాశం ఉండదని వివరించారు.
జిల్లాలోని కక్షిదారులు, ప్రతివాదులు తమ న్యాయవాదుల ద్వారా లేదా నేరుగా సంబంధిత కోర్టులను సంప్రదించి తమ కేసులను లోక్ అదాలత్ జాబితాలో చేర్చుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోర్టుల చుట్టూ తిరిగే శ్రమను, ఖర్చును తగ్గించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోరారు.

Post a Comment